: వారు పొట్టలు పెంచుకున్నారే తప్ప ఏమీ చేయలేదు: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కమీషన్లకు ఆశపడి, అక్రమంగా దోచుకొని కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వాళ్ల పొట్టలు పెంచుకున్నారే తప్పా ఏమీ చేయలేదని, పేదవాడి ఆకలి గురించి ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు.
వరంగల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ... మేనిఫెస్టోలో హామీలను వందకు వంద శాతం అమలు చేస్తోన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ‘మీరెప్పుడైనా ఊహించారా, బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు సంక్షేమ రంగానికి కేటాయిస్తారని? రాష్ట్రంలోని 40లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. మీరెప్పుడైనా ఊహించారా, వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యం ప్రవేశపెడతారని? గర్భిణీ స్త్రీల కోసం రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తారని? అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సర్కారు కృషి చేస్తోంది’ అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.