: ఆధార్ పై 542 మంది ఎంపీలు మౌనంగా ఉన్నప్పుడు...మేమెందుకు కల్పించుకోవాలి?: సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన నిబంధనపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐటీచట్టంలోని సెక్షన్ 139 ఏ(ఏ) చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా... లోక్ సభలోని 542 మంది ఎంపీలు ఆధార్ ను పాన్ కార్డుకు తప్పనిసరి చేయడాన్ని తప్పుపడుతూ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించింది.
లోక్ సభలో ప్రజాప్రతినిధులుగా కూర్చున్న 542 మంది ఎంపీలు ఈ నిర్ణయంపై అభ్యంతరం చెప్పనపుడు మేమెందుకు కల్పించుకోవాలి?’ అని పిటిషనర్ ను ద్విసభ్య ధర్మాసనం నిలదీసింది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ ను తప్పనిసరి చేయబోమని ప్రకటించిందని బెంచ్ దృష్టికి తీసుకురాగా, కేంద్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే...ఆ విషయంలో పార్లమెంట్ ను అడ్డుకోమని తెలిపింది.