: నోట్ల రద్దు దెబ్బతో వరంగల్‌కు మారిన టీఆర్ఎస్ వేదిక.. వార్షికోత్సవ సభకు 15 లక్షల మంది!
టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. నిజానికి గత డిసెంబరు 2న హైదరాబాద్‌లో జరగాల్సిన సభ ఇది. టీఆర్ఎస్ సర్కారుకు రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అప్పటికి నెలరోజుల ముందే కార్యాచరణ రూపొందించారు. అయితే అనూహ్యంగా నవంబరులో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగ సభ ఆలోచనను విరమించుకుంది.
హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న సభ ఆగిపోవడంతో టీఆర్ఎస్ 16 వార్షికోత్సవ సభకు వరంగల్‌ను వేదికగా ఎంచుకుంది. ఈ సభకు 10 నుంచి 15 లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2015లో హైదరాబాద్‌లో, 2016లో ఖమ్మంలో పార్టీ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. అనుకున్నట్టుగా 10 లక్షలకు మించి జనాలు హాజరైతే టీఆర్ఎస్ చరిత్రలో ఇదే అతిపెద్ద భారీ బహిరంగ సభగా నిలిచిపోతుంది.