: ఆధార్ వివరాలు లీక్ అయితే మూడేళ్ల జైలు... కేంద్రం హెచ్చరిక
వ్యక్తుల ఆధార్ వివరాలను బహిర్గతం చేస్తే మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదని కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చరించింది. ఏదైనా అధికార వెబ్ సైట్లో ఆధార్ వివరాలను ఉంచితే, ఆయా శాఖల అధికారులదే బాధ్యతని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, ఎవరి ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తమతమ వెబ్ సైట్లలో లేకుండా అన్ని శాఖలూ సమీక్షించుకోవాలని సూచించింది.
జార్ఖండ్ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షనర్ల ఆధార్ వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్లో కనిపించి కలకలం సృష్టించిన నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు లేఖలు పంపామని, ఐటీ చట్టం 2000, ఆధార్ చట్టం 2016 ప్రకారం నిబంధనలు మీరితే చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.