: నిన్న అన్న... నేడు తమ్ముడు... త్రివిక్రమ్ తోపాటు 'కళాతపస్వి' ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న విశ్వనాథ్ ను అభినందించేందుకు పవన్ కల్యాణ్ దర్శక మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వెళ్లాడు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కాళ్లకు నమస్కరించిన పవన్ కల్యాణ్... పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, దుశ్శాలువతో ఆయనను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విశేషాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తన సోదరుడు చిరంజీవికి ఆయన ఇచ్చిన సినిమాలు, ఇచ్చిన గుర్తింపుకు కృతజ్ఞతతో ఆయనను అభినందించారు. కాగా, నిన్న ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ నివాసానికి వెళ్లి కలుసుకుని పుష్పగుఛ్ఛం అందించి అభినందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని చిరంజీవి నెమరువేసుకున్నారు.