: మావోల దాడిపై గంభీర్ ఘాటు ట్వీట్
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడి 26 మందిని హతమార్చిన ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించిన గౌతీ... ‘ఛత్తీస్ గఢ్, కశ్మీర్, ఈశాన్యం... మనకు ఇంకా ప్రమాద ఘంటికలు అవసరమా? లేదంటే మనం చెవులు వినిపించని స్థితిలో ఉన్నామా? నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు. దీనికి ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే’ అంటూ ట్వీట్ చేశాడు.
గతంలో ఆర్మీ జవానును కశ్మీరీ యువకులు వేధించినప్పుడు కూడా గౌతమ్ గంభీర్.. ‘నా జవాన్ పై పడ్డ ప్రతి దెబ్బకు కనీసం 100 జిహాదీల ప్రాణాలు పోతాయి. ఆజాదీ కావాలనుకొనేవారు వెళ్లిపోండి. కశ్మీర్ మాది’ అని తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా గంభీర్ చేసిన ట్వీట్ కు కూడా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.