: మానవహక్కుల సంఘాలు ఎటెళ్లాయి?: ప్రశ్నించిన వెంకయ్య
ఎన్‌కౌంటర్‌లో ఒక్క నక్సల్ చనిపోయినా రాద్ధాంతం చేసే మానవహక్కుల సంఘాల నేతలు, మద్దతుదారులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల దాడిని దేశమంతా ఖండించాలన్నారు. మావోలను అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విశ్వవిద్యాలయాల్లో కూర్చుని ఖండించే మానవహక్కుల నేతలు 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోలు పొట్టనపెట్టుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. వారి ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. జవాన్లకైనా, మావోలకైనా ఒకే రకమైన హక్కులు ఉంటాయని, వారికేమీ ప్రత్యేక హక్కులు ఉండవన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నక్సలైట్ల అనాగరిక చర్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధపడుతున్నట్టు వెంకయ్య తెలిపారు.