: జయ కొడనాడు ఎస్టేట్ నుంచి వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, దస్తావేజులు మాయం!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు తేయాకు ఎస్టేట్‌లో సోమవారం వేకువజామున జరిగిన హత్య, దోపిడీ తర్వాత భవనం నుంచి విలువైన దస్తావేజులు, డబ్బు, వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు మాయమైనట్టు తెలుస్తోంది. పక్కా వ్యూహం, ముందస్తు ప్రణాళికతోనే ఈ దోపిడీ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం దుండగులు జరిపిన దాడిలో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ప్రాణాలు కోల్పోగా, మరో గార్డు కృష్ణ బహదూర్ తీవ్రంగా గాయపడ్డాడు.

సోమవారం వేకువజామున రెండు కార్లలో వచ్చిన పదిమంది ఆగంతుకులు రెండు బృందాలుగా విడిపోయారు. అందులోని ఓ బృందం భవనం ప్రవేశద్వారం వద్దకు చేరుకుని బహదూర్‌ను హత్య చేసి చెట్టుకు కట్టేశారు. మరో బృందం ఇంకో గార్డు కృష్ణ బహదూర్‌పై దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం భవనంలోకి ప్రవేశించి మూడు సూట్‌కేసుల్లో బంగారం, కోట్లాది రూపాయల సొమ్ము, ముఖ్యమైన దస్తావేజులు, వజ్రవైఢూర్యాలు దోచుకుపోయినట్టు తెలుస్తోంది.

దోపిడీ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయలేదు. గార్డు హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ధ్వంసమైన గార్డుల సెల్‌ఫోన్లు పడి ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణ బహదూర్ ప్రస్తుతం కోథగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం ఉదయం పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. దుండగులు ముసుగులు ధరించి ఉన్నారని వారిని గుర్తు పట్టడం కష్టమని చెప్పినట్టు సమాచారం. కొడనాడు హత్య ఘటనపై ఐదుగురు డీఎస్పీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News