: సెంచరీ ముందు ఆగిపోయిన తొలి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ గా మిస్బా!
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ తన కెరియర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మిస్బా కేవలం ఒక పరుగు తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. దురదృష్టం అతడిని వెంటాడటంతో 11వ సెంచరీని కోల్పోయాడు. 99 పరుగుల వద్ద మిస్బా క్రీజులో ఉన్న సమయంలో పాకిస్థాన్ చివరి వికెట్ ను కోల్పోయింది. చివరి బ్యాట్స్ మెన్ మహ్మద్ అబ్బాస్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో... మిస్బా నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెంచరీకి ఒక్క పరుగు ముందు నిలిచిపోయిన పాకిస్థాన్ తొలి క్రికెటర్ గా మిస్బా రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ విధంగా సెంచరీకి దూరమైన బ్యాట్స్ మెన్ మిస్బాతో కలిపి ఆరుగురు ఉన్నారు. ఇంతకు ముందు స్టీవ్ వా, అలెక్స్ టుడర్, జెఫ్రీ బాయ్ కాట్, షాన్ పొలాక్, ఆండ్రూ హాల్ ఇదే విధంగా సెంచరీ ముందు ఆగిపోయారు.