: మోదీ, యోగిలకు ఉగ్రముప్పు.. లండన్‌లో కశ్మీర్ ఉగ్రవాదుల ప్రణాళిక!
ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లను కశ్మీర్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మోదీ, యోగి హత్యకు లండన్‌లో పథకం వేసిన ఉగ్రవాదులు బృందాలుగా విడిపోయి యూపీ, ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వారెక్కడ ఉన్నదీ తెలియనప్పటికీ ఉగ్రముప్పు సమాచారాన్ని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు రక్షణ కల్పించే అధికారులకు చేరవేశారు.
ముంబైలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా మోదీ, యోగిలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు సమాచారం అందింది. వీరిద్దరిపై దాడిచేసేందుకు రాయ్‌గఢ్‌లో కొందరు రహస్య మంతనాలు జరుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో వారిని పట్టుకునేందుకు మహారాష్ట్రలోని సీనియర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో గతవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేంద్రహోంశాఖ యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు ఎన్ఎస్‌జీ కమాండో భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఆయనకున్న జడ్‌ప్లస్ భద్రతకు ఇది అదనమని పేర్కొంది.