: గుజరాత్ తరహాలో ఏపీలో భూసేకరణ చట్టం.. ఆమోదించాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు
భూసేకరణ చట్టానికి గుజరాత్ ప్రభుత్వం చేసినట్టుగానే తాము కూడా సవరణలు చేస్తామని, దానిని ఆమోదించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రాత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు అవసరమైన సవరణలు చేపట్టనున్నట్టు తెలిపారు.
నిజానికి ఈ చట్టానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సవరణలు చేసిందని, అయితే వాటికి కేంద్ర న్యాయశాఖ అభ్యంతరాలు చెబుతోందని పేర్కొన్నారు. భూసేకరణ చట్టానికి గుజరాత్ ప్రభుత్వం చేసిన సవరణలను కేంద్రం ఆమోదించిందని, తాము కూడా ఆ రాష్ట్రం తరహాలోనే సవరణలు చేస్తామని పేర్కొన్నారు. సవరణలు చేసి చట్టాన్ని ఆమోదించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇందుకు సానుకూలంగా స్పందించారు.