: ఇక తమిళనాడు వంతు... 'బాహుబలి' రగడతో కన్నడ సినిమాలకు అడ్డంకులు
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కేంద్రంగా సాగిన రభస ఇంకా సమసిపోలేదు. ఆయనతో క్షమాపణలు చెప్పించేంత వరకూ వదలని కన్నడిగులు పట్టుబట్టి పంతం నెగ్గించుకోగా, ఇప్పుడు గొడవలు తమిళనాడుకు పాకాయి. తమ నటులను పదేపదే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తమిళ సంఘాలు కన్నడ చిత్రాల ప్రదర్శనను అడ్డుకున్నాయి. తాజాగా విడుదలైన కన్నడ చిత్రాలను ప్రదర్శిస్తున్న పలు థియేటర్ల వద్దకు వచ్చిన తంబీలు, బలవంతంగా చిత్ర ప్రదర్శనను ఆపివేయించారు. కన్నడ సంఘాలు పదే పదే సినిమాల ప్రదర్శనలకు అడ్డు పడుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలవనున్నట్టు ఫిలిం చాంబర్ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందన్నది ఆందోళన కలిగిస్తోందని సినీ పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానించారు.