: రాహుల్ ను తిట్టి, సస్పెన్షన్ కు గురైన బర్కా సింగ్... నేడు బీజేపీలోకి!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా ఎదగలేదని, ఆయన మానసిక స్థితి ఎదుగుదల ఆగిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆరేళ్ల పాటు సస్పెన్షన్ కు గురైన ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత బర్కా శుక్లా సింగ్, నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ ఇన్ చార్జ్ శ్యామ్ జాజు సమక్షంలో ఈ మధ్యాహ్నం ఆమె బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా, బర్కా సింగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆ పార్టీ ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆమె, బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఎంతమాత్రమూ లేదని, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో మహిళలను చిన్నచూపు చూశారని ఆమె ఆరోపించారు. ఇక బర్కా సింగ్ బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాతే రాహుల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.