: గంటా, సీఎం రమేష్ లతో మేము నోటికొచ్చినట్టు మాట్లాడలేదు: మాజీ మంత్రి బొజ్జల కుమారుడు
ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందునే బొజ్జలను మంత్రివర్గం నుంచి తప్పించామని టీడీపీ అధినాయకత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో, బొజ్జల అలకపాన్పు ఎక్కారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. దీంతో, ఆయనకు సర్ది చెప్పేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్ లు ఆయన నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా బొజ్జల కుటుంబ సభ్యులు వీరిద్దరినీ దుర్భాషలాడారని సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగింది. తిట్లను భరించలేక వారిద్దరూ బయటకు వచ్చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బొజ్జల కుమారుడు సుధీర్ స్పందించారు. కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారిద్దరూ తమ ఇంటికి వచ్చినప్పుడు, ఎంతో అభిమానంతో మాట్లాడుకున్నామని చెప్పారు. ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో చూస్తుంటే తమకు ఎంతో ఆవేదన కలుగుతోందని అన్నారు. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పారు.