: తగ్గిన ఈపీఎస్.. మెత్తబడిన ఓపీఎస్.. కొలిక్కి వస్తున్న విలీనం!


తమిళనాడులో వైరి వర్గాలుగా విడిపోయి విలీనానికి  సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు కాస్త మెత్తబడ్డాయి. ఇద్దరూ చెరోమెట్టు దిగడంతో విలీనానికి మార్గం సుగమమవుతోంది. కొట్లాడుకుంటే పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని భావిస్తున్న ఈపీఎస్ విలీనం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  పొంతనలేని డిమాండ్లతో పన్నీర్ వర్గం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పళనిస్వామి మాత్రం విలీన ప్రయత్నాలను మానుకోవడం లేదు. శుక్రవారం ఆయన రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో విలీనం అంశంపై విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

పన్నీర్ వర్గం పట్టువీడకున్నా పార్టీని బలోపేతం చేసేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. తన అభివృద్ధికి కారణమైన పార్టీని నిలుపుకునేందుకు ఓపీఎస్ వర్గంతో చర్చించేందుకు కూడా తాను సిద్ధమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. విలీనంపై చర్చించేందుకు రాజ్యసభ సభ్యుడు వైద్యలింగం, మంత్రులతో కూడిన కమిటీని నియమించారు. విలీనంపై ఓపీఎస్ వర్గంతో చర్చించేందుకు ఈ కమిటీ సూచనలు చేస్తుందని వివరించారు.

మరోవైపు వివిధ డిమాండ్లతో ఈపీఎస్ వర్గానికి కంటిమీద కునుకు దూరం చేసిన ఓపీఎస్ వర్గం శుక్రవారం కొంత మెత్తబడింది. విలీనం విషయంలో బెట్టువీడి ఈపీఎస్‌ వర్గంతో కలిసి వెళ్లడమే మంచిదని ఓపీఎస్ వర్గం అభిప్రాయపడింది. పన్నీర్ సెల్వం సూచనల మేరకు అధికార అన్నాడీఎంకేతో చర్చించేందుకు తాను సిద్ధమని కేపీ మునుస్వామి ప్రకటించారు. ఈపీఎస్ వర్గంతో చర్చించేందుకు పన్నీర్ సెల్వం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి మునుస్వామి నాయకత్వం వహిస్తారు. ఫలితంగా నిన్నమొన్నటి వరకు వ్యూహప్రతివ్యూహాలతో వేడెక్కిన తమిళ రాజకీయం శుక్రవారం కాస్త చల్లబడింది. ఇరు వర్గాలు విలీనమే లక్ష్యంగా బెట్టుచేయకుండా ముందుకెళ్లాలని నిర్ణయించడంతో విలీనం ఖాయమని తేలిపోయింది.
 

  • Loading...

More Telugu News