: తన కత్తికి రెండు వైపులా పదునుందని చూపిన కట్టప్ప!
కన్నడనాట 'బాహుబలి: ది కన్ క్లూజన్'ను విడుదల కానీయబోమని, సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టిన కన్నడ సంఘాల ఒత్తిడికి ఎట్టకేలకు దిగొచ్చిన సత్యరాజ్ క్షమాపణలు చెప్పారు. ఇదే సమయంలో తన క్షమాపణల వల్ల తమిళనాడులో సినిమాకు వ్యతిరేక పరిస్థితులు తలెత్త వచ్చన్న ఆలోచనతో, అటు తమిళ తంబీలనూ ప్రసన్నం చేసుకునేలా కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించి, తన కత్తికి రెండు వైపులా పనునుందని ఆయన చెప్పకనే చెప్పారు.
తమిళ ప్రజలు తన క్షమాపణలను అర్థం చేసుకోవాలని, కావేరీ నీటి కోసం తన పోరాటం సాగుతుందని అన్నారు. తమిళ ప్రజల తరఫున వాదనలు వినిపించడాన్ని ఇష్టపడతానని చెప్పి, తమిళులకు ఆగ్రహం కలుగకుండా చూసే ప్రయత్నాలు చేశారు. గతంలో ఈ అంశంపై కన్నడ, తమిళ నటులు పరస్పరం వ్యతిరేక విమర్శలు గుప్పించుకున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే, కన్నడ నటుల వ్యాఖ్యలకు నిరసనగా తాను మాట్లాడానని, అది కూడా ఇటీవలి కాలంలో కాదని చెప్పుకొచ్చారు.
ఇక కేవలం కన్నడిగులకు క్షమాపణలు చెప్పి వదిలేస్తే, సత్యరాజ్ పై తమిళనాట ఆగ్రహం ఉవ్వెత్తున లేస్తుందని ఇప్పటికే సినీ విశ్లేషకులు తేల్చి చెప్పారు. అందువల్లే ఆయన క్షమాపణలు చెప్పడం లేదన్న కథనాలూ వచ్చాయి. ఇక బాహుబలి విడుదల తేదీ దగ్గర పడటం, కన్నడనాట థియేటర్లను బుక్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు భయపడుతూ ఉండటంతోనే, అటు నొప్పింపక, తానొవ్వక అన్న చందంలో సత్యరాజ్ మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూనే, క్షమాపణలూ చెప్పారు. ఇక సత్యరాజ్ పరిస్థితిని తమిళ ప్రజలు అర్థం చేసుకుని ఏ వివాదాన్నీ లేవనెత్తకుండా ఉంటారా? లేక ఆయన కన్నడిగులకు క్షమాపణలు చెప్పి తమిళులను అవమానించారని నిరసనలకు దిగుతారా? అన్నది వేచి చూడాలి.