: కన్నడిగులకు 'కట్టప్ప' సత్యరాజ్ క్షమాపణల పూర్తి పాఠం...!

కన్నడిగులకు వ్యతిరేకంగా గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ, సత్యరాజ్ ఓ ప్రకటనను స్వయంగా చదివి వినిపించారు. ఆ వీడియోను మీడియాకు విడుదల చేశారు. "అందరికీ నమస్కారం. నేను తొమ్మిది సంవత్సరాల క్రితం కావేరీ వివాదంలో కొన్ని వ్యాఖ్యలు చేశాను. నేను ఎప్పుడూ కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదు. నా వ్యాఖ్యలతో కన్నడ ప్రజలు బాధపడితే క్షమాపణలు చెబుతున్నా. బాహుబలి-2 సినిమా రిలీజ్ ను అడ్డుకోవద్దు. తొమ్మిదేళ్ల నాటి నా వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తెచ్చారు. అప్పట్లో నేను ఒక్కడినే కాదు. తమిళ, కన్నడ నటులు ఈ అంశంపై పరస్పరం వ్యాఖ్యలు చేశారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో నా సినిమాలు 30 వరకూ విడుదల అయ్యయి.

ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా అభ్యంతరాలు పెట్టలేదు. నేను మాట్లాడిన మాటలు కన్నడ ప్రజలను బాధించివుంటే మరోసారి క్షమాపణలు చెబుతున్నా. కోట్లు ఖర్చుపెట్టి తీసిన బాహుబలి మూవీలో వేలాది మంది కష్టం, శ్రమ వున్నాయి. సినిమా కోసం దర్శకుడు రాజమౌళి ఎంత కష్టపడ్డారో దగ్గరుండి చూసిన నాకు తెలుసు. నా వ్యాఖ్యల వల్ల సినిమాకు ఇబ్బందులు రావడం ఇష్టం లేదు. అందుకే ఈ క్షమాపణలను చెబుతున్నా. ఈ క్షమాపణలను తమిళ ప్రజలు, తమిళ చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాలి. తమిళ ప్రజల తరఫున నా వాదన వినిపించడమే నాకు ఇష్టం. భవిష్యత్తులోనూ కావేరీ జలాల కోసం తమిళ ప్రజల తరఫున పోరాడతా. ఇకపై నా వల్ల సినిమాలపై ప్రభావం పడుతుందని భావిస్తే, నిర్మాతలు ఎవరూ నన్ను పెట్టుకోవద్దు. నేను మూఢనమ్మకాలపై పోరాటం చేస్తాను. నా పోరాటం కొనసాగుతుంది" అని సత్యరాజ్ అన్నారు.

More Telugu News