: గులాబీ పండగకు వేళాయె... టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీకి సర్వం సిద్ధమైన వేళ, పార్టీ అధ్యక్షుడిగా మరోమారు కేసీఆర్ ఎన్నికయ్యారని, రిటర్నింగ్ అధికారి, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, అధ్యక్ష పదవికి ఎన్నికలు ప్రకటించిన తరువాత కేసీఆర్ తరఫున క్యాబినెట్ మంత్రులు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యులు, మండలి సభ్యులు ఒక్కో సెట్ చొప్పున, శాసన సభ్యులు నాలుగు సెట్లు, జడ్పీ చైర్ పర్సన్, కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక్కో సెట్ చొప్పున కేసీఆర్ పేరిట నామినేషన్లు వేశారని అన్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని వెల్లడించారు.
కాగా, కొంపల్లి వేదికగా, టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు రెండు నెలుగా ఏర్పాట్లు చేశామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. వచ్చిన వారందరికీ తెలంగాణ వంటకాలతో విందు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పలు తీర్మానాలపై ఇక్కడ చర్చలు సాగనున్నాయని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇక్కడ నిర్ణయాలు వెలువడనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.