: 'బాహుబలి-2'లోని ఆ కీలక సన్నివేశానికి గ్రాఫిక్స్ అవసరం లేదు... అందుకే అది నాకు తెలియదు: కమల్ కణ్ణన్
ప్రపంచ సినీ ప్రేక్షక లోకానికి ఈ దశాబ్దపు అతిపెద్ద సస్పెన్స్ గా నిలిచిన 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' ప్రశ్నకు సమాధానం తనకు కూడా తెలియదని, అది ఒక్క రాజమౌళికి మాత్రమే తెలుసునని చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ ను తీర్చిదిద్దిన కమల్ కణ్ణన్ వ్యాఖ్యానించారు. ఈ సీన్ లను చిట్టచివరిగా తెరకెక్కించారని, ఆ సీన్లలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు చోటు లేకపోవడంతో, తనకు కారణం తెలీదని అన్నారు.
మరో ఆరు రోజుల్లో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, ఓ దినపత్రికతో మాట్లాడిన ఆయన, ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్రపంచంలోని గ్రాఫిక్స్ సంస్థల్లో ఒక్కటి మినహా మిగతా అన్నింటిలో జరిగాయని, జర్మనీలో సర్వర్ ను ఉంచి, అక్కడి నుంచే ఎవరికి ఏ సన్నివేశం కావాలన్నా తీసుకునే ఏర్పాటు చేశామని, అందువల్లే ఏ సీన్ కూడా లీక్ కాలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 36 స్టూడియోల్లో 2,226 షాట్స్ కు వీఎఫ్ఎక్స్ చేశామని, 1000 మంది టెక్ నిపుణులు 18 నెలల పాటు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు.