: పన్నీర్ డిమాండ్లకు ఈపీఎస్ వర్గం కౌంటర్.. తొలుత పార్టీ గుర్తుపై ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని డిమాండ్
విలీనానికి రోజుకో షరతు పెడుతున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి సీఎం పళనిస్వామి వర్గం కౌంటరిచ్చింది. తమకు షరతులు విధించే ముందు తొలుత పార్టీ గుర్తుపై ఎలక్షన్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ‘‘పార్టీ గుర్తుపై తొలుత వారే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దానిని వారు ఉపసంహరించుకోవాలి’’ అని పళని వర్గానికి చెందిన ఎంపీ ఆర్. వైతిలింగం డిమాండ్ చేశారు.
ఇక పన్నీర్ వర్గం మరో డిమాండ్ అయిన జయలలిత మృతిపై విచారణ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటుందని పేర్కొన్నారు. కాగా, శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి సాగనంపినట్టు ఎలక్షన్ కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేసేంత వరకు విలీనం ప్రసక్తే లేదని పన్నీర్ వర్గం గురువారం డిమాండ్ చేయడంతో పళని వర్గం పైవిధంగా స్పందించింది.