: బీరు బాటిల్‌తో హిందూ ఆలయంలోకి ప్రవేశించిన విదేశీజంట!
ఓ విదేశీయుడు బీర్ బాటిల్‌ను చేతిలో పట్టుకొని ఆలయంలోకి ప్రవేశించిన ఘటన కర్ణాటకలోని హంపీలో కలకలం రేపింది. బీరు బాటిల్‌తో విరూపాక్ష ఆలయంలోకి ప్రవేశించబోయిన ఆ వ్యక్తిని మొదట అక్కడి భక్తులు అడ్డుకొని బయటకు పంపించేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవ్వరి కంటా పడకుండా మళ్లీ ఆ ఆలయంలోకి ప్రవేశించి అలజడి రేపాడు. అయితే, ఆ విదేశీయుడు మద్యం సీసాతో ఆలయంలోకి ప్రవేశిస్తున్నా.. ఆ ఆలయ సిబ్బంది, అధికారులు అడ్డుకోలేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.
ఆ ఆలయంలోకి బీరు బాటిల్‌తో ప్రవేశించడానికి ఆ విదేశీయుడికి అతని భార్య కూడా సహకరించింది. వీరిరువురూ హాలెండ్ నుంచి ఇండియాకు వచ్చి పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతున్నారు. బీరు బాటిల్‌తో ప్రవేశించకూడదని చెప్పిన అనంతరం ఆ వ్యక్తి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి ఆలయంలో ప్రవేశించాడు. ఈ క్రమంలో అతడి భార్య తన దుస్తుల్లో బీరు బాటిల్‌ను దాచి పెట్టుకొచ్చి, ఆ ఆలయంలోకి ప్రవేశించగానే తన భర్తకు ఇచ్చింది. విషయాన్ని గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే వచ్చి ఆ జంటను బయటికి పంపించారు.