: మాల్యాను భారత్ రప్పించడానికి ఏడాది పడుతుందా?
రూ. 9 వేల కోట్లకు పైగా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి, లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అరెస్ట్ అయిన మూడు గంటల వ్యవధిలోనే బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, మాల్యాను భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అయితే, మాల్యాను ఇక్కడకు తీసుకురావడానికి సుమారు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఈడీ అధికారులు చెబుతున్నారు.
అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ పై మాల్యా విడుదల కావడంపై తాము నిరాశ చెందలేదని... వీలైనంత త్వరగా ఆయనను భారత్ కు తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు, మాల్యాను భారత్ కు తీసుకురావడం అంత ఈజీ కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అక్కడి కోర్టులు కనీసం డజను తీర్పులు ఇచ్చాక గానీ, అక్కడి ఉన్నత న్యాయస్థానాలు ఏ నిర్ణయానికి రావని అంటున్నారు.