: ఆదివారం పెట్రోలు బంకులకు సెలవుపై సరికొత్త ట్విస్ట్!
వచ్చే నెల 14 నుంచి దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోలు బంకులు మూసివేయాలన్న నిర్ణయానికి పెట్రో బంకుల డీలర్ల సంఘాలు ససేమిరా అంటున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చాకే దీనిపై ఆలోచిస్తామని చెబుతున్నాయి. పెట్రోలుపై లీటరుకు ఇస్తున్న రూ.2.56, డీజిల్‌పై ఇస్తున్న రూ.1.65 కమీషన్‌ను పెంచాలని డీలర్ల సంఘాలు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నాయి. డీలర్ల డిమాండ్‌పై వచ్చే నెల 10న కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించనుంది. దీంతో అది చూశాకే ఆదివారం సెలవు అమలుపై నిర్ణయం తీసుకుంటామని డీలర్ల సంఘాలు చెబుతున్నాయి.
మరోవైపు పెట్రోలు బంకులకు వారాంతపు సెలవులపై కొందరు పెదవి విరుస్తున్నారు. ఆదివారం సెలవు అమలు చేస్తే శనివారమే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారని, అంతేకాక బ్లాక్ మార్కెట్‌కు కూడా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు వాడకాన్ని తగ్గించి ఇంధన వనరులను పరిరక్షించుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం పెట్రోలు బంకులు మూసివేయనున్నట్టు పెట్రోల్ బంకుల యాజమాన్యం ప్రకటించింది. అయితే అంతలోనే తమ డిమాండ్లు నెరవేరాకే దీనిపై ఆలోచిస్తామని చెప్పడం గమనార్హం.