: నేరం రుజువైతే.. అద్వానీ, జోషి, ఉమలకు ఐదేళ్ల జైలు శిక్ష!
1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ (89), మురళీ మనోహర్ జోషీ (83), ఉమాభారతి (57)లపై నమోదైన కుట్ర అభియోగాలపై విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. వీరిపై నమోదైన అభియోగాలు కనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్న ఉమా భారతి బుధవారం మాట్లాడుతూ రామ మందిరం కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
అసలు బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి అయోధ్య వెళ్లేందుకు ఉమ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే బీజేపీ చీఫ్ అమిత్‌షాతో సమావేశం అనంతరం ఆమె తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకోవాలని షా కోరడంతో ఉమ విరమించుకున్నట్టు సమాచారం. కాగా, అద్వానీ, జోషీ, ఉమాభారతిపై నమోదైన అభియోగాలు కనుక రుజువైతే భారత శిక్షా స్మృతి ప్రకారం రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రసంగాలు ఇవ్వడం తదితర నేరాల కింద గరిష్టంగా వీరికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.