: నేటి నుంచే తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులు: కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి విద్యాసంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. దీంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో మొదలైన ఒంటిపూట బళ్లు ఉదయంపూట జరుగుతున్నాయి. దీంతో మిట్టమధ్యాహ్నాం స్కూళ్ల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. సూర్యుడు మండిపోతున్నాడు. మిట్టమధ్యాహ్నం యూవీ కిరణాలు కూడా వెలువడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు వీటి బారిన పడకుండా ఉండేందుకు తక్షణం వేసవి సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు తెలంగాణలో స్కూళ్లకు ఈ విద్యాసంవత్సరంలో చివరి వర్కింగ్ డే కానుంది. రేపటి నుంచి తెలంగాణలో స్కూళ్లు, కళాశాలలకు వేసవి సెలవులు వర్తించనున్నాయి. మళ్లీ జూన్ 12న స్కూళ్లు, కళాశాలలు తెరచుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎండల తీవ్రవతను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.