: ఏపీలో కాంట్రాక్ట్ కార్మికులపై వరాల జల్లు కురిపించిన ప్రభుత్వం.. 26,664 మందికి లబ్ధి!

కాంట్రాక్ట్ కార్మికులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 50 శాతం మేర వేతనాలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో 26,664 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై చర్చించిన మంత్రుల బృందం వారి వేతనాలను 50 శాతం పెంచాలని నిర్ణయించింది. అంతేకాక పెంచిన వేతనాలను ఏప్రిల్ నుంచే వర్తింప చేసేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే విధి నిర్వహణలో విఫలమైన, క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించేవారిపై తప్ప మిగిలిన కార్మికులను తొలగించరాదని మంత్రుల బృందం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంట్రాక్ట్ కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచడం వల్ల ఖాజానాపై రూ.199.74 కోట్ల అదనపు భారం పడనుంది.  కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతూ మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేయడంపై  ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

More Telugu News