: నేడో రేపో దినకరన్ అరెస్ట్.. సాక్ష్యాలతో వస్తున్న ఢిల్లీ పోలీసులు!
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నేడో, రేపో ఆయన అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన తర్వాత రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు జైలుకు పంపుతున్నాయి. రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు దినకరన్ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే రూ.50 కోట్లు ఇవ్వజూపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటకకు చెందిన బ్రోకర్ సుకేష్ చంద్రశేఖర్ ద్వారా దినకరన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సోమవారం అతడు పోలీసులకు పట్టబడడంతో గుట్టురట్టయింది. అతడి నుంచి రూ.1.30 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్మును దినకరన్ ఇచ్చాడని సుకేష్ విచారణలో తెలిపాడు. దీంతో దినకరన్‌ను విచారించేందుకు పోలీసులు అనుమతి పొందారు.
సుకేష్ నుంచి పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు చెన్నైకి వచ్చి ఏ క్షణంలోనైనా దినకరన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. నేడు (బుధవారం), లేదంటే గురువారం ఢిల్లీ పోలీసులు చెన్నైలో అడుగుపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర కూడా ఉందని నిర్ధారించుకున్న పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం. సుకేష్ ఎవరో తనకు తెలియదని దినకరన్ చెబుతున్నా పోలీసులు మాత్రం గట్టి ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. వారిద్దరికీ చాలాకాలంగా పరిచయం ఉందని, గతంలో చాలాసార్లు కలిసి మాట్లాడుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ పరిచయంతోనే ఈ ‘డీల్’ కుదుర్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు.