: వీసాల జారీని రద్దు చేసిన ఆస్ట్రేలియా... ఇండియన్ టెక్కీలపై పెను ప్రభావం!


అమెరికా దారిలోనే నడిచిన ఆస్ట్రేలియా, భారత ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో స్థిరపడిన వారిపై పెను ప్రభావం చూపేలా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగులకు ఇచ్చే '457 వీసా' ప్రోగ్రామ్ ను రద్దు చేస్తున్నట్టు నేడు సంచలన ప్రకటన చేసింది. ఈ తరహా వీసాలను వాడుతూ, సుమారు 95 వేల మంది ఉపాధిని పొందుతుండగా, వారిలో అత్యధికులు భారతీయులే. తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, విదేశీ ఉద్యోగుల కారణంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్, ఈ వీసాల జారీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తమది వలస దేశమే అయినప్పటికీ, ఇక్కడి ఉద్యోగాల్లో దేశ ప్రజలకు ప్రాధాన్యతను పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

కాగా, ఆస్ట్రేలియాలో '457 వీసా'పై పని చేస్తున్న వారిలో ఇండియన్స్ తరువాత, యూకే, చైనా దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ఇకపై ఈ తరహా వీసాలు జారీచేయబోమని, ఈ ఉద్యోగాలన్నీ ఆస్ట్రేలియన్లకే దక్కుతాయని భావిస్తున్నానని ఈ సందర్భంగా మాల్కమ్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి 95,757 మంది వీసాలు పొంది ఆస్ట్రేలియాలో పని చేస్తుండగా, కొత్త నిబంధనలతో మరో వీసా ప్రోగ్రామ్ ను తీసుకు వస్తామని ఆయన తెలిపారు. ఇకపై విదేశీ ఉద్యోగులు వారి నైపుణ్యం ఆధారంగానే దేశంలోకి ప్రవేశం పొందుతారని స్పష్టం చేశారు. కాగా, ఆస్ట్రేలియా తాజా నిర్ణయం వేలాది మంది భారతీయులపై, ముఖ్యంగా ఐటీ నిపుణులపై ప్రభావం చూపుతుందని వీసా నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News