: ఈ దశాబ్దపు అతిపెద్ద సినీ సీక్రెట్... వందలాది మంది యూనిట్ సభ్యులకూ ఎందుకు తెలీదో కారణం చెప్పిన ప్రభాస్!


ఈ దశాబ్దపు అతిపెద్ద సినీ సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న వినిపిస్తుంది. రెండు సంవత్సరాలుగా అశేష సినీ ప్రేక్షక జనం ఈ చిత్రం కోసం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తుండగా, ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. దీనికి కారణం చెప్పాడు హీరో ప్రభాస్. వాస్తవానికి ఏదైనా సినిమాలో ప్రేక్షకులకు ఆసక్తి, ఉత్కంఠను కలిగించే చిన్న చిన్న సీక్రెట్స్ ఉన్నా, వాటిని గురించి చిత్రీకరించే సమయంలో సినిమా యూనిట్ లో పనిచేసే వారికి తెలుస్తుంది. వారి నుంచి బయటకు లీకులు వస్తాయి. కానీ, బాహుబలి చిత్రానికి వందలాది మంది పని చేసినా, వారెవరికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు.

ఇక, దీనిపై ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే, సినిమాను ఆస్వాదించలేరని చెప్పిన ప్రభాస్, కేవలం ఒక్క సీన్ లో ఆన్సర్ రివీల్ కాదని చెప్పాడు. 'బాహుబలి' సినిమా రిలీజ్ కు ముందే రెండో భాగంలోని ముఖ్యమైన సీన్ల షూటింగ్ పూర్తయిందని, అందువల్ల సెట్లో చాలామంది ఆ సీన్స్ ను సరిగ్గా చూడలేదని, అందువల్లే యూనిట్ సభ్యులకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదని అన్నాడు. కేవలం ఒక్క సీన్ లో సమాధానం లభించదని, ఓ 30 సీన్లలో జరిగిన అంశాల కారణంగా కట్టప్ప అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఒకవేళ, మొదటి భాగం రిలీజ్ తరువాత, ఈ సీన్స్ తీసివుంటే, యూనిట్ లో ఎంతో మందికి జవాబు తెలిసి ఏదో ఒక విధంగా బయటకు వచ్చి వుండేదన్న అభిప్రాయాన్ని ప్రభాస్ వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News