: పేరొస్తే ఏంటి? రాకపోతే ఏంటి, డ్యూడ్... ఎంజాయ్ చేశానా? లేదా? అన్నదే ముఖ్యం!: ప్రభాస్
‘బాహుబలి’కి నాలుగేళ్లు కష్టపడ్డాను... మళ్లీ అలాంటి కథతోనే జాతీయ లేదా అంతర్జాతీయ సినిమా తీస్తామని ఎవరైనా వస్తే చేయనని చెప్పేస్తానని ప్రముఖ నటుడు ప్రభాస్ చెప్పాడు. ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రభాస్... ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ ఆ సినిమా లక్షకోట్ల బడ్జెట్ సినిమా అయినా కూడా తాను నటించనని అన్నాడు. ఇప్పుడు కాకుండా మరో నాలుగేళ్ల తరువాత అయితే దానిలో నటిస్తానేమో తెలియదని ప్రభాస్ చెప్పాడు.
‘బాహుబలి’ సినిమాను ఎంజాయ్ చేశానని అన్నాడు. తనకు పేరు రావడం లేదా రాకపోవడం అనేది పెద్ద విషయం కాదని, తాను ఆనందంగా ఉన్నానా లేదా అన్నది ముఖ్యమని ప్రభాస్ స్పష్టం చేశాడు. తాను ఎంజాయ్ చేయలేని పేరు, ప్రతిష్ఠలను ఏం చేసుకోవాలని ప్రభాస్ ప్రశ్నించాడు. ప్రస్తుతానికి సుజీత్ సినిమాలో నటిస్తున్నానని ప్రభాస్ తెలిపాడు.