: బ్రిటీష్ రాణి బంగారు గుర్రపు బగ్గీపై ట్రంప్ కన్ను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా తాను అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా చేసేస్తున్నారు. వలసవాదులను నియంత్రించడం కానీ, సిరియాపై దాడి కానీ, మరేదైనా కానీ తాను అనుకున్నట్టుగానే కానిచ్చేస్తున్నారు. అయితే, ఆయన మనసులో మరే అధినేతకూ లేని ఒక గొప్ప కోరిక ఉందట. అదేంటంటే, బ్రిటీష్ రాణి ప్రయాణించే బంగారు గుర్రపు బగ్గీలో ప్రయాణించాలనేది ట్రంప్ కోరికట.
తన బ్రిటన్ పర్యటనలో ఈ బగ్గీలో ప్రయాణించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. బ్రిటన్ పర్యటన సందర్భంగా రాణి నివాసం ఉండే బకింగ్ హామ్ ప్యాలెస్ కు భారీ భధ్రత మధ్య ప్రత్యేక వాహనంలో ట్రంప్ ను తీసుకెళ్లనున్నారు. అయితే, ఆ ప్రత్యేక వాహనం కాకుండా, బంగారు వర్ణంలో ఉండే రాణి గారి గుర్రపు బగ్గీని ఏర్పాటు చేయాలని వైట్ హౌస్ అధికారులు పట్టుబడుతున్నారట. అయితే, గుర్రపు బగ్గీలో వెళ్తే ట్రంప్ కు భద్రత కల్పించడం చాలా కష్టమవుతుందని లండన్ భద్రతాధికారులు కలవరపడుతున్నారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ట్రంప్ బ్రిటన్ లో పర్యటించే అవకాశం ఉంది.