: 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్' శబ్దం 58 కిలోమీటర్ల వరకు వినిపించింది... గుండెలదిరిపోయాయి: ప్రత్యక్ష సాక్షులు
ఆప్ఘనిస్తాన్ లోని మోమండ్ వ్యాలీలో అమెరికా వాయుదళం జార విడిచిన 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్' పేలుడు శబ్దానికి తమ గుండెలదిరిపోయాయని ఆప్ఘానిస్థాన్ పౌరులు తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని అమెరికా ప్రయోగించిన ఈ బాంబు పేలుడు శబ్దం లక్షిత ప్రాంతం నుంచి 58 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని వారు తెలిపారు. దాని తీవ్రతకు ఇంటి డోర్లు, కిటికీలు ఊగిపోయాయని చెప్పారు. మరికొందరైతే తమ ఇల్లు కూలిపోతుందేమోనని భయభ్రాంతులకు గురయ్యామని అన్నారు.
శబ్దం వచ్చిన దిశగా ఉంటున్న బంధువులు ఎలా ఉన్నారోనని ఆందోళన చెందామని, పలువురుకి ఫోన్ చేసి, వారు సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకోవడంతో మనసు కుదుటపడిందని వారు తెలిపారు. అయితే పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడాలని ఉన్నా అక్కడి దుష్ప్రభావాలను తెలుసుకోవడంతో ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడం ఎందుకని వెళ్లలేదని వారు తెలిపారు. అయితే ఈ ఘటనలో పౌరులెవరూ మరణించలేదన్న వార్త ఊరటనిచ్చిందని వారు తెలిపారు.