: ఉత్తరకొరియాపై అమెరికా దాడి?.. కొన్ని గంటల్లో తుది నిర్ణయం.. సైన్యాన్ని అప్రమత్తం చేసిన కిమ్ జాంగ్

వరుస క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. ప్రపంచ అగ్ర దేశాలు, ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పటికే ఐదు అణు పరీక్షలను నిర్వహించిన కిమ్ జాంగ్ ఆరో అణు పరీక్షకు సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. తన తాత, ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి (ఏప్రిల్ 15) సందర్భంగా ఈ అణు ప్రయోగం నిర్వహించవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జయంతి సందర్భంగా భారీ మిలటరీ డ్రిల్ నిర్వహిస్తే పర్వాలేదని... అణు పరీక్ష నిర్వహిస్తే మాత్రం సిరియాపై దాడి చేసినట్టుగానే, ఉత్తరకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ సలహాదారు ఒకరు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో, ఉత్తరకొరియా అణు పరీక్ష నిర్వహిస్తుందా? ఆ దేశంపై అమెరికా దాడి చేస్తుందా? అనే ప్రశ్నలకు కొన్ని గంటల్లో సమాధానం తెలియనుంది. మరోవైపు అమెరికాకు ఏ మాత్రం భయపడే ప్రసక్తే లేదని కిమ్ జాంగ్ ప్రకటించారు. తాము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. దీనికితోడు ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. భవిష్యత్తులో ఉత్తరకొరియా, దక్షిణకొరియా ఏకమవుతాయని... ఆ దేశానికి కూడా తానే అధ్యక్షుడిని అవుతానని తెలిపారు.  

More Telugu News