: ఐపీఎల్ లో వీక్షకుల రికార్డు.. నిర్వాహకుల హ్యాపీ!
ఐపీఎల్ సీజన్-10 విశేషంగా అభిమానులను అలరిస్తోంది. పొట్టి ఫార్మాట్ వచ్చిన అనంతరం దానిని తొందరగా అందిపుచ్చుకున్న బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రవేశపెట్టింది. దీంతో క్రికెట్ అంటే పడిచచ్చే క్రీడాభిమానులు దీనిని విశేషంగా ఆదరించారు. తొలి 9 సీజన్ల కంటే పదో సీజన్ కు మరింత ఆదరణ లభిస్తోంది. టీమిండియా వరుస విజయాలు అభిమానులను అలరించాయి. టూర్లు అయిపోవడంతో పొట్టి ఫార్మాట్ ప్రారంభమైంది. వివిధ దేశాల ఆటగాళ్లతో కొత్త హీరోలను అందించే ఐపీఎల్ ను భారత క్రికెట్ అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. వారికి తగ్గట్టే ఆటగాళ్లు ఈసారి భారీ స్కోర్లతో ఆకట్టుకుంటున్నారు. పర్యవసానంగా ఐపీఎల్ గత సీజన్ కంటే ఎంతో ఆదరణ మూటగట్టుకుంది.
ఈ క్రమంలో ఈ సీజన్ ను వీక్షకులు రికార్డు స్థాయిలో మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. ప్రస్తుత పదో సీజన్ లో కేవలం మూడు మ్యాచ్ ల్లోనే 185.7 మిలియన్ల వీక్షకులు నమోదు కావడంతో ఐపీఎల్ స్పాన్సర్లు సంబరాల్లో మునిగిపోయారు. ఒక ప్రేక్షకుడు మ్యాచ్ ను చూసే సగటు సమయం 72 నిమిషాలుగా నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని ఐపీఎల్ వెల్లడించింది. గత సీజన్ లో తొలి మూడు మ్యాచ్ లను వీక్షించిన వీక్షకుల సంఖ్య 160.7 మిలియన్లు కాగా, సగటు సమయం కేవలం 46 నిమిషాలు మాత్రమేనని ఐపీఎల్ తెలిపింది. ఈ సీజన్ తొలి వారం ఐపీఎల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుందని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. దీంతో బీసీసీఐకి కాసుల పంట పండుతోంది.