: కోహ్లీ వచ్చేశాడు... రేపు బరిలోకి దిగుతాడు!
గత నెలలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా గాయపడిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా కోలుకున్నాడు. రేపు ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ బరిలోకి దిగుతాడని బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ప్రస్తుతం కోహ్లీ పూర్తి ఫిట్ గా ఉన్నాడని, ఆర్సీబీ తదుపరి మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని ఓ ప్రకటనలో పేర్కొంది.
కుడి భుజానికి తగిలిన గాయం పూర్తిగా మానిందని తెలిపింది. కాగా, నిన్ననే కోహ్లీ కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన కోహ్లీ, క్రిస్ గేల్, సచిన్ బేబీల నెట్ ప్రాక్టీస్ ను పరిశీలించి, ఆపై తేలికపాటి వ్యాయామాలు చేశాడు. ఇక తన జిమ్ సెషన్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కోహ్లీ, మైదానంలోకి దిగేందుకు ఇంకా ఆలస్యం చేయలేనని వ్యాఖ్యానించాడు.