: దాడి చేసింది నిజమే... చెప్పుతో మాత్రం కొట్టలేదు: 'సాక్షి' కథనంపై మంత్రి పరిటాల సునీత వివరణ
సాక్షి దినపత్రికలో వచ్చిన 'పరిటాల ఇలాకాలో అరాచకం' కథనంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు. కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం టైపిస్టుపై, ఓ ఎంపీపీ భర్త ముకుందనాయుడు చెప్పుతో కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని, అయితే, దాడి చేసిన మాట వాస్తవమని, ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామని ఆమె తెలిపారు.
పింఛన్ల జాబితాను తయారు చేసే విషయంలో టైపిస్టుకు, ముకుందనాయుడికి మధ్య వాదనలు పెరిగిన మాట నిజమేనని, అయితే, టీవీల్లో వచ్చినట్టు దాడి జరగలేదని అన్నారు. కాగా, ఈ విషయంలో పరిటాల సునీత కల్పించుకోవడంతో, ఎంపీపీ పద్మగీత, ఎంపీడీఓ జలజాక్షి తదితరులు మీడియా సమావేశం నిర్వహించి, ఇకపై ప్రజా ప్రతినిధులు, అధికారులమంతా కలసి పని చేస్తామని చెప్పారు. బాధితుడు టైపిస్టు మూర్తితో అధికారులకు రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది.