: కుక్కలను బంధించి, హింసించి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!

కుక్కలను హింసించినందుకు గానూ ఇద్ద‌రు ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ ముంబైలోని జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్‌) అనే కార్పొరేట్‌ రియాల్టీ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. పీపుల్స్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) అనే సంస్థకు చెందిన నిరాలి కొరాడియా అనే మహిళ.. జేఎల్ఎల్ నిర్వహణలో ఉన్న ఒక వాణిజ్య ప్రాంగణంలో ఉండాల్సిన కొన్ని కుక్కలు కనిపించడం లేదని గుర్తించింది. అనంత‌రం ఈ విష‌యంపై ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యాన్ని తెలుసుకున్న జేఎల్ఎల్ సంస్థ‌ ఈ నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులే వాటిని ప‌ట్టుకొని, ఓ చోట బంధించి చిత్రహింసలకు గురిచేశార‌ని అనంత‌రం ఆ కుక్క‌ల‌ను వేరే చోటుకు తీసుకెళ్లి వదిలేసినట్లు తెలుసుకుంది.

త‌మ కార్యాల‌యం వ‌ద్ద ఉండే కుక్కల‌ను హింసించ‌డంతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి పేర్లు జూలియస్, జగతప్ అని ఆ సంస్థ తెలిపింది. క్రునాల్ అనే మ‌రో వ్యక్తి కూడా జూలియ‌స్‌, జ‌గ‌త‌ప్‌ల‌తో ఉన్నాడ‌ని, అయితే అత‌డు నేరుగా బాధ్యుడు కాడు కాబట్టి అతడిని వదిలిపెట్టారని చెప్పారు. వారు చిత్రహింసలు పెట్టిన కుక్కలు రెండూ చాలా ఆరోగ్యంగా ఉండేవ‌ని, వాటికి రేబిస్ వాక్సిన్లు కూడా వేశారని పీపుల్స్ ఫర్ యానిమల్స్ కార్య‌క‌ర్త‌లు పేర్కొన్నారు. చదువుకున్న వ్య‌క్తులు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం భావ్యం కాద‌ని అన్నారు.

More Telugu News