: శరీరం వెలుపల గుండెతో పుట్టిన శిశువు.. కలెక్టర్ చొరవతో ఉచిత వైద్యం !

ఓ శిశువు శరీరం వెలుపల గుండెతో పుట్టిన ఘ‌ట‌న మధ్యప్రదేశ్, ఖజురహోలోని ఓ ఆసుప‌త్రిలో చోటు చేసుకుంది. త‌మ వ‌ద్ద వైద్యం చేయించేంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో ఆ పాప త‌ల్లిదండ్రులు మొద‌ట ఆందోళ‌న చెందారు. అయి‌తే, చివ‌ర‌కు కలెక్టర్ చొరవతో ఆ పాప‌కు ఇప్పుడు వైద్యం అందుతోంది. ఆ పాప తండ్రి అరవింద్ పటేల్ ఖజురహో ఆలయానికి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. తన భార్య‌కి పురిటి నొప్పులు రావ‌డంతో ఈ నెల 5న‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే, అత్యంత అరుదైన సమస్యగా భావించే ఎక్టోపియా కార్డిస్ (శరీరం వెలుపల గుండె) తో త‌నకు పాప పుట్టిందని తెలుసుకొని బాధ‌ప‌డ్డాడు. ఆ పాప‌ను తక్షణమే ఛత్తార్పూర్ జిల్లా ఎస్ఎన్సీయూ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో ఆ శిశువును అక్కడికి తీసుకెళ్లాడు.

అయితే, ఆ పాప‌కు వైద్యం చేయించడం తమ వల్ల కూడా కాదని ఆస్పత్రి అంబులెన్స్ లో గ్వాలియర్ ఆస్పత్రికి పంపించారు. గ్వాలియర్ లోని గజరాజా మెడికల్ ఆస్పత్రిలో కూడా ఆ పాప‌కు చికిత్స అందలేదు. మ‌రోవైపు ఆ పాప వైద్యానికి రూ.25-30 లక్షల వరకూ ఖర్చ‌వుతుంద‌ని తెలుసుకున్నాడు. దీంతో ఆ తండ్రి క‌లెక్ట‌రును సంప్ర‌దించాడు. తాను చాలా పేదవాడినని, పాప ఆపరేషన్ కు అంత‌ ఖర్చు భ‌రించ‌లేన‌ని చెప్పాడు. క‌లెక్ట‌ర్ జోక్యంతో గ్వాలియర్ ఆస్పత్రి నుంచి ఆ పాప‌ను భోపాల్ లోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆ ఆసుప‌త్రిలో శిశువుకి చికిత్స కొన‌సాగుతోంది.

More Telugu News