: అత్యాచారం నుంచి తప్పించుకోవడానికి ప్రాణత్యాగం చేసిన టర్కీ మోడల్!


కామాంధులు చుట్టుముట్టి, స్నేహితుడిని తన కళ్ల ముందే దారుణంగా కొట్టి, తనను వివస్త్రను చేసి అత్యాచారానికి ఉపక్రమించబోయిన తరుణంలో, తనను తాను కాపాడుకోవడానికి ఓ భవంతి పై నుంచి దూకి ప్రాణత్యాగం చేసిందో మోడల్. తనను ఏదైనా చేయాలని చూస్తే, దూకి చచ్చిపోతానని అరుస్తూ, కిందనుంచి పలువురు చూస్తుండగానే దూకేసింది. ఈ హృదయ విదారక ఘటన గురించి మరింత సమాచారం లోకి వెళితే, టర్కీకి చెందిన యువ మోడల్ గులేయ్ బర్సాలీ, తన స్నేహితుడు ఎన్జిన్ ఓ తో కలసి సెలవులను గడిపేందుకు ఓ అపార్టుమెంటును అద్దెకు తీసుకోవాలని భావించింది.

వారాంతాన్ని గడిపేందుకు తనకో అపార్టుమెంటును అద్దెకిప్పించాలని ఓ రెంటల్ ఏజంట్ ను సంప్రదించగా బసక్ సెహిర్ జిల్లాలో ఓ ఇంటిని అతను చూపించాడు. ఆపై ఇంటి తాళాలను తీసుకున్న వీరు, ఓ బార్ లో స్నేహితులతో పార్టీ చేసుకుని ఆపై ఇంటికి వెళ్లారు. వీరు వెళ్లిన కాసేపటికి మరో వ్యక్తితో కలసి వచ్చిన రెంటల్ ఏజంట్, ఇంట్లోని కొన్ని వస్తువులను యజమానికి అప్పగించాల్సి వుందని చెబుతూ లోనికి వచ్చాడు.

ఆ వెంటనే ఎన్జిన్ ను దారుణంగా కొట్టి, అతని సెల్ ఫోన్ ను లాక్కొని అపార్టమెంటులోని ఓ గదిలో బంధించారు. మరో గదిలోకి బాధితురాలిని లాక్కెళ్లి, ఆమెను వివస్త్రను చేశారు. వారికి లొంగేందుకు ఇష్టం లేని ఆమె, అరుస్తూ, కిటికీలో నుంచి దూకేందుకు సిద్ధమైంది. తనను లోపలికి లాగాలని చూస్తే, తాను దూకేస్తానని కేకలు పెట్టింది. ఈ కేకలు కింద ఉన్న వారు విని పోలీసులకు సమాచారం ఇచ్చే లోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. పై నుంచి దూకిన గులేయ్ మరణించింది. ఈ కేసులో నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, ఎన్జిన్ ను ప్రశ్నించి వదిలేశారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News