: నిదానంగా దూకుడు ప్రదర్శించిన రైనా, కార్తీక్... గుజరాత్ 183/4
గుజరాత్ లయన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ నింపాదిగా దూకుడు ప్రదర్శించారు. ఒకరు ఫోర్ కొడితే మరొకరు సిక్స్ కొడుతూ.. మరొకరు ఫోర్.. ఇలా స్కోరు బోర్డును పరుగులెత్తిస్తూ పోయారు. సుదీర్ఘ కాలం టోర్నీలకు దూరంగా ఉన్న సురేష్ రైనా అర్ధ సెంచరీతో అలరించగా, టీమిండియాకు దూరమైన దినేష్ కార్తీక్ నిలకడగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. రైనా కంటే కార్తీక్ ఆకట్టుకోవడం విశేషం. 51 బంతులాడిన రైనా ఏడు ఫోర్ల సాయంతో 68 పరుగులు చేయగా, కేవలం 21 బంతులాడిన దినేష్ కార్తీక్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. వీరిద్దరి దూకుడుతో గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, పియూష్ చావ్లా, బౌల్ట్ చెరొక వికెట్ తీశారు.