: తెలంగాణలో సమ్మె విరమణకు అంగీకరించిన లారీ యాజమాన్య సంఘం
తెలంగాణ ప్రభుత్వంతో లారీ యజమానుల సంఘం చర్చలు ఫలప్రదమయ్యాయి. గత వారం రోజులుగా సమ్మెలో ఉన్న లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, లారీ ఓనర్స్ అసోసియేషన్ పలు డిమాండ్లు చేసిందని అన్నారు. అసోసియేషన్ చేసిన డిమాండ్లలో రాష్ట్రపరిధిలో వచ్చే సహేతుకమైన వాటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లారీ యజమానుల సమ్మె కారణంగా సరకు రవాణా ఆగిపోయిందని, సేవలను పునరుద్ధరించాలని కోరామని, దానికి వారు అంగీకరించారని ఆయన తెలిపారు. కాగా, ఏపీలో నిన్ననే లారీ యజమాన్య సంఘం సమ్మె విరమించిన సంగతి తెలిసిందే.