: పైన దేవుడున్నాడు.. అన్నీ ఆయనకు తెలుసు.. వీళ్లు కొత్తగా చేసేదేమీ లేదు!: జగన్
కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకు వచ్చిన తర్వాతనే తనపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తనపై కేసులు లేవని, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం కూడా తనపై కేసులు లేవని తెలిపారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే కేసులు పెట్టారని చెప్పారు. సోనియాగాంధీతో కలసి చంద్రబాబు ఈ కేసులు పెట్టారని ఆరోపించారు. జగన్ కనపడకపోతే వైసీపీ ఉండదనే కారణంతోనే తనపై కేసులు పెట్టారని తెలిపారు. ఒక వ్యక్తి తప్పు చేసినట్టు రుజువు కాలేకపోతే, మూడు నెలలకు మించి జైల్లో పెట్టే అధికారం లేదని... కానీ, తనను రాజకీయంగా అణగదొక్కేందుకు నెలల తరబడి జైల్లో ఉంచారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా వీళ్లు చేసేదేమీ లేదని... పైన దేవుడున్నాడు, అన్నీ ఆయనకు తెలుసని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.