: తెలంగాణ పోలీసు విభాగానికి అరుదైన గౌరవం.. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులకు శౌర్యచక్ర

బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది జనవరి 23న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆలమ్ జెబ్ అఫ్రిదీని ప్రాణాలకు తెగించి పట్టుకున్న తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసులకు ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర అవార్డు లభించింది. ఉగ్రవాది దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా ప్రాణాలను పణంగా పెట్టి అతడిని పట్టుకున్న శ్రీనివాసులకు గతేడాది ఆగస్టులో శౌర్యచక్ర ప్రకటించారు.

గురువారం రాష్ట్రపతి భవన్‌లోని అశోకాహాల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. శ్రీనివాసులుకు శౌర్యచక్ర అందించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సహా మొత్తం 12 మందికి శౌర్యచక్ర ప్రకటించారు. వీరిలో శ్రీనివాసులు ఒక్కరే దక్షిణాదికి చెందినవారు కావడం గమనార్హం. హెడ్ కానిస్టేబుల్ హోదాలో ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన శ్రీనివాసులు తెలంగాణ  పోలీసు విభాగానికి అరుదైన గౌరవం తెచ్చిపెట్టారు.

More Telugu News