: ఆసుపత్రిలో వినోద్ ఖన్నాను చూసి కంటతడిపెట్టిన బాలీవుడ్ నిర్మాత
నాటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చికిత్స పొందారు. అయితే, వినోద్ ఖన్నాను పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్ నటుడు, నిర్మాత, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘నాకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ వినోద్ ఖన్నా సాహెబ్ ను ఆసుపత్రిలో చూసి ఏడ్చేశాను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు, ఆసుపత్రిలో ఉన్న వినోద్ ఖన్నా ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం వినోద్ ఖన్నా డీహైడ్రేషన్ కు గురైవడంతో ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆయన కేన్సర్ తో బాధపడుతున్నట్టు వదంతులు వ్యాపిస్తున్నాయి.