: బాలీవుడ్ హీరోలతో తలపడుతున్న ఎంపీలు!
పార్లమెంటు సభ్యులతో బాలీవుడ్ స్టార్లు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఎంపీస్ ఎలెవెన్ జట్టుకు లోక్ సభ సభ్యుడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ నాయకత్వం వహిస్తుండగా... ముంబై హీరోస్ జట్టుకు బాబీ డియోల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగనుంది. 2025 నాటికి దేశం నుంచి టీబీ వ్యాధిని తరిమికొట్టాలనే లక్ష్యంలో భాగంగా... ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు.
ధర్మశాలలో ఏప్రిల్ 8వ తేదీన ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగబోతోంది. అంతేకాదు, టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, క్షయ వ్యాధి నిపుణులు, వైద్యులు, ప్రభుత్వ ప్రతినిధులు, టీబీ రోగులు పాల్గొంటారు. 2025 నాటికి దేశంలో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకూడదనే లక్ష్యాన్ని భారత ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలను ఉపయోగించుకుంటే... ప్రజల్లోకి త్వరగా సమాచారం వెళుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఎంపీల జట్టులో అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, రాజీవ్ శుక్లా, మనోజ్ తివారి, నిషికాంత్ దూబే, బాబుల్ సుప్రియో తదితరులు ఉన్నారు. బాలీవుడ్ జట్టులో బాబీ డియోల్, సోనూ సూద్, సునీల్ షెట్టి, జిమ్మి షెర్గిల్, సొహైల్ ఖాన్, విక్కీ చోప్రా, వరుణ్ బదోలా, ఇంద్రనీల్ సేన్ గుప్తా తదితరులు ఉన్నారు.