: బుర్ర తక్కువ వాడిని.. నా బుర్రను తమ్మారెడ్డి భరద్వాజ వాష్ చేశారు: ఎంఎం కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇటీవల చేసిన ట్వీట్లపై విమర్శలు రావడం తెలిసిందే. తన కెరీర్ కి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై ఆయన ఈ ట్వీట్లు చేశారు. అయితే, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సలహా మేరకు ఇటీవల తాను చేసిన ట్వీట్లను తొలగించినట్టు కీరవాణి తెలిపారు. ఈ మేరకు తాజాగా ట్వీట్లు చేశారు. ఆయా ట్వీట్లలో ఏమన్నారంటే... ఇటీవల తాను చేసిన ట్వీట్లు చాలా మందిని బాధించాయని, తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దల సూచనల మేరకు వాటిని తొలగించానని పేర్కొన్నారు.
ఐదు నిమిషాల పాటు బుర్ర లేని తన బుర్రను తమ్మారెడ్డి వాష్ చేశారని అన్నారు. తమ్మారెడ్డి లాంటి వారు మమ్మల్ని సరిదిద్దుతుంటారని... దర్శకులందరూ గొప్పవారు, వినయ విధేయతలు కల్గిన వారేనని, తాను మాత్రం ఎప్పటికీ బుర్ర తక్కువ వాడినేనని, తాను తప్పా.. అందరూ సృజనశీలురు, అణకువగా ఉండే వారేనని ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్ప వాళ్లేనని, వాళ్లతో పని చేసేందుకు తాను పడి చస్తానని తెలిపిన కీరవాణి, అందరి కన్నా చివరి స్థానంలో ఉండే తాను ఓ బుర్ర లేని కంపోజర్ ని అంటూ ట్వీట్ చేయడం ఆశ్చర్యం గొలుపుతోంది.