: పసికందుని కళేబరంలో పెట్టి.. ఆపై ప్రార్థనలు.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న వైనం... వీడియో వైరల్!
కొన్ని నెలల వయసున్న పసికందుని ఓ వ్యక్తి ఓ గుర్రం కళేబరంలో ఉంచి ప్రార్థనలు చేస్తుండగా తీసిన ఓ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇదేం విడ్డూరం అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ చిన్నారిని తీసుకొచ్చిన ఓ వ్యక్తి అక్కడి చనిపోయిన గుర్రం కళేబరంలో పడుకోబెట్టి కొన్ని సెకన్ల పాటు ఉంచాడు. ఈ క్రమంలో ఆ పిల్లాడితో పాటు ఆ వ్యక్తికి గుర్రం రక్తం అంటింది.
కొన్ని సెకన్ల తరువాత ఆ వ్యక్తి ఆ చిన్నారిని మళ్లీ బయటకు తీశాడు. ఆయన ఒక్కడే కాదు.. ఇలా పిల్లలని కళేబరంలో ఉంచి తీయడం వారి ఆచారమట. ఈ ఆచారాన్ని పాటించే సమయంలో ఓ మతపెద్ద 'పిల్లల్ని ఎప్పుడూ రక్షించు' అంటూ దేవుడిని కోరతాడు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియోతో అక్కడి ఈ ఆచారంపై నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదెక్కడి ఆచారం? అంటూ విమర్శలు చేస్తున్నారు.