: తెలుగోడికి సొంతమైన ఇండియన్ ఐడల్ కిరీటం.. ఫైనల్‌లో ఉర్రూతలూగించిన రేవంత్
ఇండియన్ ఐడల్ సీజన్-9 కిరీటాన్ని తెలుగు యువకుడు ఎల్‌వీ రేవంత్ (25) గెలుచుకున్నాడు. పోటీదారులు పీవీఎన్ఎస్ రోహిత్, ఖుదా భక్ష్‌లతో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో విజయం సాధించాడు. ఆదివారం ముంబైలో జరిగిన ఫైనల్లో తన గానమాధుర్యంతో, స్టెప్పులతో అందరినీ అలరించాడు. ‘చక్ దే’ సినిమా నుంచి ‘మర్ జాయేన్ యా జీ లూన్ జరా’ పాటపాడి జవాన్లకు అంకితమిచ్చాడు. ‘లడకీ కా గయీ చుల్’ పాటపాడుతూ అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఫైనల్లో సత్తా చాటి విజేతగా నిలిచిన రేవంత్‌కు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఐడల్ ట్రోఫీని బహూకరించాడు. ఇండియన్ ఐడల్ ట్రోఫీతోపాటు యూనివర్సల్ మ్యూజిక్ కంపెనీతో రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.25 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. కాగా ఈ పోటీలో రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు.
తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200 పాటలు పాడిన రేవంత్‌కు బాహుబలి సినిమాలో పాడిన ‘మనోహరి..’ పాట ఎంతో పేరు తీసుకొచ్చింది. హిందీ సరిగా పలకలేకపోతున్నాడన్న విమర్శలకు సమాధానంగా సీజన్ మొత్తం హిందీ పాటలు పాడిన రేవంత్ దేశ్యావ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో తెలుగు కుర్రాడు శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్-5 టైటిల్‌ను గెలుచుకున్నాడు.