: 'పెళ్లి పందిరి'తో జరిగిన మోసం జీవితంలో మర్చిపోలేను!: కాస్ట్యూమ్స్ కృష్ణ


'పెళ్లి పందిరి' సినిమా సందర్భంగా తాను చవి చూసిన అనుభవం జీవితంలో మర్చిపోలేనని ప్రముఖ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ తెలిపాడు. జగపతిబాబు హీరోగా నటించిన 'పెళ్లి పందిరి' సినిమాను కేవలం 45 రోజుల్లో నిర్మించానని ఆయన అన్నారు. సినిమా చూసిన పలువురు సినిమా సూపర్ హిట్ అని చెప్పారని, మౌత్ టాక్ చాలు అని సలహా ఇవ్వడంతో... అప్పటికే చాలా సినిమాలకు పని చేసిన అనుభవంతో పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని ఆయన అన్నారు. అయితే ఆ సాయంత్రం సినిమా హీరో జగపతిబాబు తనకు ఫోన్ చేసి పిలిచారని, దాంతో తాను వెళ్ళగానే, 'సినిమాకు పబ్లిసిటీ చేయనన్నావట ఏమిటి?' అంటూ ఆయన అడిగారని చెప్పారు.

దానికి 'అవునండీ మన సినిమా సూపర్ హిట్.... దీనికి పబ్లిసిటీ అవసరం లేదు, మౌత్ టాక్ సరిపోతుంది' అని తాను సమాధానమిచ్చానని, దానికి ఆయన నొచ్చుకుని, 'అదేంటి కృష్ణ, నువ్వే కదా అని 5 లక్షలు రెమ్యూనరేషన్ తగ్గించుకుని సినిమా చేస్తే... నువ్విలా అంటే ఎలా?' అని ఆయన అనడంతో తాను 'సరే' అన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఫైనాన్షియర్లు రెండు లక్షలు ఇచ్చారని, తన నుంచి రెండు స్టాంపు పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. తనకు చదువు లేకపోవడంతో తాను వారు చెప్పిన చోట సంతకం పెట్టానని తెలిపారు.

ఇక తాను ఊహించినట్టే సినిమా సూపర్ హిట్ అయిందని ఆయన చెప్పారు. దీంతో తమిళంలో కొంత మంది పరిచయస్తులు వచ్చి 7 లక్షలకు ఆ సినిమా హక్కులు అడిగారని, తాను కూడా సరేనన్నానని ఆయన తెలిపారు. తరువాత రోజు వాళ్లు ఫోన్ చేసి... 'అదేంటి కృష్ణ, నీ సినిమా ఫైనాన్షియర్లు 25 లక్షలు అడుగుతున్నారు?' అన్నారని, దీంతో తాను వారితో మాట్లాడితే సినిమాతో నీకేం సంబంధం? అని అడిగారని, నేను నిర్మాతనంటే... మాకు అమ్మేశావని, గతంలో సంతకం పెట్టిన కాగితాలు తనకు చూపించారని, దీంతో తాను షాక్ కు గురయ్యానని ఆయన తెలిపారు. అప్పుడే ఇకపై సినిమాలు నిర్మించకూడదని అనుకున్నానని ఆయన తెలిపారు. అవకాశం వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News