: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్.... డివిలీర్స్ కూడా దూరం?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఆర్సీబీ తరపున ఆడనున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ గాయపడ్డాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ తో మ్యాచ్ సందర్భంగా కుడి భుజం గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ ఐపీఎల్ ఆరంభంలో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో కోహ్లీ స్థానంలో డివిలియర్స్ సారథ్యం వహిస్తాడని ప్రకటించిన మరుసటి రోజే అతను గాయపడడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న దక్షిణాఫ్రికా దేశవాళీ మొమెంటమ్ కప్ ఫైనల్స్ కు దూరమయ్యాడు. నడుము నొప్పి కారణంగా అతను మ్యాచ్ కు దూరమైనట్టు జట్టు యాజమాన్యం తెలిపింది. అయితే డివిలియర్స్ గాయం తీవ్రత తెలియాల్సి ఉండగా.. ఐపీఎల్ లో పాల్గొంటాడా? లేదా? అన్న విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది.